LATEST ARTICLES

దీపావళి రోజున భారత చైనా సరిహద్దులో స్వీట్ల పంచుకున్న ఇరుదేశాల జవాన్లు

0

న్యూఢిల్లీ, న్యూస్ టుడే, అక్టోబర్ 31 : దీపావళి సందర్భంగా భారత, చైనా సైనికులు గురువారం వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పలు సరిహద్దు పాయింట్ల వద్ద ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు.

తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్ మరియు దేప్సాంగ్ ప్లెయిన్స్‌లోని రెండు రాపిడి పాయింట్‌ల వద్ద రెండు దేశాలు సైన్యాన్ని విడదీయడం పూర్తి చేసిన తరువాత ఇలా దీపావళి స్వీట్స్ మార్చుకోవడం విశేషం.

అరుణాచల్ ప్రదేశ్‌లోని బమ్ లా మరియు వాచా/కిబితు, లడఖ్‌లోని చుషుల్-మోల్డో మరియు సిక్కింలోని నాథులా – LAC వెంట ఉన్న ఐదు బోర్డర్ పర్సనల్ మీటింగ్ (BPM) పాయింట్ల వద్ద ఈ మార్పిడి జరిగింది.

బుధవారం, రెండు రాపిడి పాయింట్ల వద్ద ఇరు పక్షాల దళాలు ఉపసంహరణను పూర్తి చేశాయని, ఈ పాయింట్ల వద్ద పెట్రోలింగ్ త్వరలో ప్రారంభమవుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఎట్టకేలకు బెంగళూర్‌కు ఓ విజయం

0

హైదరాబాద్‌, న్యూస్ టుడే, అక్టోబర్‌ 29 : ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయాలు చవిచూసిన బెంగళూర్‌ బుల్స్‌ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. మంగళవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీపై 34-32తో పైచేయి సాధించి, 2 పాయింట్ల తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేసింది.

దబంగ్‌ ఢిల్లీకి ఇది ఐదు మ్యాచుల్లో రెండో ఓటమి కాగా, బెంగళూర్‌ బుల్స్‌కు ఇది ఐదు మ్యాచుల్లో తొలి విజయం కావటం గమనార్హం. బెంగళూర్‌ బుల్స్‌ తరఫున 11వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మ్యాట్‌పై అడుగుపెట్టిన జై భగవాన్‌ (11 పాయింట్లు) సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో బుల్స్‌కు విజయాన్ని అందించాడు. దబంగ్‌ ఢిల్లీ ఆటగాళ్లలో ఆషు మాలిక్‌ (13 పాయింట్లు) సూపర్‌ టెన్‌తో మెరిసినా ఆ జట్టుకు పరాజయం తప్పలేదు.

ప్రథమార్థం దబంగ్‌దే :

వరుస పరాజయాలతో నైరాశ్యంలో ఉన్న బెంగళూర్‌ బుల్స్‌పై దబంగ్ ఢిల్లీ ధనాధన్ షో చేసింది. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలోనే 22-14తో ఏకంగా ఎనిమిది పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు ఆషు మాలిక్‌, వినయ్‌ అంచనాలు అందుకోవటంతో దబంగ్‌ ఢిల్లీకి ఎదురు లేకుండా పోయింది. కూతలో దబంగ్ ఢిల్లీకి బెంగళూర్‌ బుల్స్‌ పోటీ ఇచ్చినా.. డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోయింది. మెరుపు ట్యాకిల్స్‌తో ప్రథమార్థంలో ఓసారి బెంగళూర్‌ బుల్స్‌ను ఆలౌట్‌ చేసింది.

బుల్స్‌ సూపర్‌ షో :

సెకండ్‌హాఫ్‌లో దబంగ్‌ ఢిల్లీకి బెంగళూర్‌ బుల్స్‌ గట్టి పోటీ ఇచ్చింది. కెప్టెన్‌ పర్దీప్‌ నర్వాల్‌ కూతలో ముందుండి నడిపించగా.. డిఫెండర్లు సైతం ట్యాకిల్స్‌తో మెరిశారు. ఇదే సమయంలో దబంగ్‌ ఢిల్లీ సైతం పాయింట్లు ఖాతాలో వేసుకుంటూ వచ్చింది. దీంతో ద్వితీయార్థంలో సమవుజ్జీగా పాయింట్లు సాధించినా ప్రథమార్థంలో కోల్పోయిన ఆధిక్యం బెంగళూర్‌ బుల్స్‌ను వెంటాడింది. ఆఖరు పది నిమిషాల్లో అదరగొట్టే ప్రదర్శన చేసిన బెంగళూర్‌ బుల్స్‌ స్కోరు సమం చేసి ఏకంగా ఆధక్యంలోకి దూసుకెళ్లింది.

కెప్టెన్‌ పర్దీప్‌ నర్వాల్‌ను దబంగ్‌ ఢిల్లీ నిలువరించినా.. జై భగవాన్‌ను ఆ జట్టు డిఫెండర్లు నిలువరించలేకపోయారు. 11 రెయిడ్‌ పాయింట్లతో మెరిసిన భగవాన్‌ బెంగళూర్‌ బుల్స్‌ను గెలుపు బాట పట్టించాడు. ఆటలో మూడోంతుల భాగం ఆధిక్యంలో నిలిచిన దబంగ్‌ ఢిల్లీ.. ఆఖర్లో బోల్తా పడింది.

బెంగాల్‌, పుణెరి పోరు టై 

0

*బెంగాల్‌, పుణెరి పోరు టై.. 32-32తో ఇరు జట్ల స్కోర్లు ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11

హైదరాబాద్‌, న్యూస్ టుడే,అక్టోబర్‌ 29 : ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో మరో మ్యాచ్‌ టైగా ముగిసింది. ఆఖరు కూత వరకు ఉత్కంఠరేపిన బెంగాల్‌ వారియర్స్‌, పుణెరి పల్టాన్‌ పోరు 32-32తో టై అయ్యింది. మాజీ చాంపియన్ల సమరంలో ప్రథమార్థం ఆటలో పుణెరి పల్టాన్‌ మూడు పాయింట్ల ఆధిక్యం సాధించినా..

ద్వితీయార్థంలో బెంగాల్‌ వారియర్స్‌ లెక్క సమం చేసింది. పీకెఎల్‌ సీజన్‌ 11లో ఇది మూడో టై కావటం విశేషం.

బెంగాల్‌ వారియర్స్‌ ఆటగాళ్లలో రెయిడర్‌ సుశీల్‌ (10 పాయింట్లు) సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో మెరువగా..నితిన్‌ కుమార్ (6 పాయింట్లు), నితేశ్‌ కుమార్‌ (4 పాయింట్లు) రాణించారు. పుణెరి పల్టాన్ తరఫున ఆకాశ్‌ షిండె (8 పాయింట్లు), పంకజ్‌ మోహిత్‌ (8 పాయింట్లు) ఆకట్టుకున్నారు. ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు,ఓ టైతో పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్‌ అగ్రస్థానం నిలుపుకోగా.. బెంగాల్‌ వారియర్స్‌ నాలుగు మ్యాచుల్లో ఒక్క విజయమే సాధించింది.

బెంగాల్‌ వారియర్స్‌తో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌ శుభారంభం చేసింది. తొలి పది నిమిషాల్లో పాయింట్ల కోసం ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చారు. ప్రతి కూతకు పాయింట్లు మారుతుండటంతో ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్టు ఉత్కంఠ నడిచింది. తొలి పది నిమిషాల ఆట అనంతరం బెంగాల్‌ వారియర్స్‌ 7-6తో ఓ పాయింట్‌ ముందంజలో నిలిచింది. కానీ తర్వాతి పది నిమిషాల్లో పుణెరి పల్టాన్‌ పుంజుకుంది. ప్రథమార్థం ఆట ముగిసే సమయానికి పుణెరి పల్టాన్‌ మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది. 15-12తో బెంగాల్‌ వారియర్స్‌పై పైచేయి సాధించింది.

విరామం అనంతరం బెంగాల్‌ వారియర్స్‌ దూకుడు పెంచింది. రెయిడర్లు సుశీల్‌ సూపర్‌ టెన్‌ షోతో దూకుడు పెంచాడు. దీంతో బెంగాల్‌ వారియర్స్‌ వెనుకంజ నుంచి పుంజుకుని ఆధిక్యం కోసం పోటీపడింది. రెయిడింగ్‌లో నితిన్‌ కుమార్‌, డిఫెన్స్‌లో నితిన్‌ మెరవటంతో బెంగాల్‌ వారియర్స్‌ రేసులోకి వచ్చింది. 30-31తో ఓ పాయింట్‌ వెనుకంజలో ఉండగా విశ్వాస్‌ రెయిడ్‌ పాయింట్‌తో బెంగాల్‌ వారియర్స్‌ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా చావోరేవో తేల్చకోవాల్సిన రెయిడ్లలో ఇరు జట్లు నిరాశపరిచాయి. ఆఖరు రెండు కూతల్లో ఎవరికీ పాయింట్‌ దక్కలేదు. దీంతో 32-32తో బెంగాల్ వారియర్స్‌, పుణెరి పల్టాన్ సమవుజ్జీలుగా నిలిచి పాయింట్లను సమానంగా పంచుకున్నాయి.

సూర్య ఇది గ్లోబల్ స్కూల్లో దీపావళి కార్నివల్

0

హైదరాబాద్, న్యూస్ టుడే 29 : శేరిలింగంపల్లి లోని సూర్య గ్లోబల్ స్కూల్ అమీన్పూర్ లో ఘనంగా నిర్వహించిన దీపావళి కార్నివల్లో కాంతులతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వేడుకలకు భారీగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక అలంకరణలు, మరియు ఆనందోత్సాహాలతోఈ కార్నివల్లో మరుపురాని జ్ఞాపకాలను అందించాయి. ఈ వేడుకలు సాంప్రదాయ దీపాల వెలుగులతో ప్రారంభమయ్యాయి, ప్రత్యేకంగా “సూర్య” అనే ఆకారంలో నీరాజనంగా డిజైన్ చేసిన దీపాలు, విద్య, విజ్ఞానాలను దీప కాంతులను వెలిగించాలన్న సూర్య గ్లోబల్ స్కూల్ యొక్క సంకల్పాన్ని ప్రతిబింబించాయి.

రంగస్థల కార్యక్రమాల్లో జె.ఆర్.డి. టాటాకు సాంస్కృతిక నివాళులు, అద్భుతమైన నృత్య ప్రదర్శనలు, రాక్షస దహనం మరియు అబ్బురపరిచే టపాసులప్రదర్శన ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి, ఇవన్నీ చెడు మీద మంచి విజయం పొందినది అని తెలుపుతూ ఈ సందేశాన్ని అందించాయి. కార్నివల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మరియు విద్యార్థులందరూ కలసి సంబరంగా నృత్యాలను చేస్తూ అందరికీ ఆనందాన్ని పంచడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సూర్య ది గ్లోబల్ స్కూల్ ఫౌండర్ చైర్మన్ దామోదర్ రావు, చైర్మన్ నరసింగ రావు, సీనియర్ ప్రిన్సిపల్ & ట్రస్టీ లక్ష్మీ ధరిత్రి, అకాడమిక్ ఇంచార్జ్ శ్రీలత, అమీన్పూర్ ప్రిన్సిపల్ వాణి లంక, అడ్మిన్ హెడ్ విరాట్ పాల్గొన్నారు.

పట్నా పైరేట్స్‌ పై తెలుగు టైటాన్స్‌ ఘన విజయం

0

*ఆశీష్‌ మెరిసే.. టైటాన్స్‌ మురిసే..పట్నా పైరేట్స్‌ పై తెలుగు టైటాన్స్‌ విజయం.

హైదరాబాద్‌, న్యూస్ టుడే, అక్టోబర్‌ 28 : ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌ ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి నుంచి పుంజుకున్న తెలుగు టైటాన్స్‌.. సోమవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన లీగ్‌ దశ మ్యాచ్‌లో మూడు సార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌పై మెరుపు విజయం సాధించింది.

ప్రథమార్థంలో వెనుకంజ వేసిన టైటాన్స్‌.. ద్వితీయార్థంలో దుమ్మురేపే ప్రదర్శన చేసింది. 2 పాయింట్ల తేడాతో సీజన్లలో రెండో విజయం సాధించి.. వరుస పరాజయాలకు చెక్‌ పెట్టింది. తెలుగు టైటాన్స్‌ రెయిడర్లు ఆశీష్‌ నర్వాల్‌ (9 పాయింట్లు), పవన్‌ సెహ్రావత్‌(5 పాయింట్లు), డిఫెండర్‌ అంకిత్‌ (4 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్‌ తరఫున రెయిడర్లు దేవాంక్‌(7 పాయింట్లు), అయాన్‌ (6 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్‌కు మూడు మ్యాచుల్లో ఇది రెండో ఓటమి కాగా.. తెలుగు టైటాన్స్‌కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో విజయం కావటం విశేషం.

ప్రథమార్థం హోరాహోరీ : 

వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్‌.. పట్నా పైరేట్స్‌తో మ్యాచ్‌లో సైతం శుభారంభం చేయలేదు. స్టార్‌ రెయిడర్‌ పవన్‌ సెహ్రావత్‌ తొలి కూతలోనే అవుట్‌ కాగా.. ఐదు నిమిషాల వరకు అతడు బెంచ్‌పైనే కూర్చుకున్నాడు. ఆరో నిమిషంలో పవన్‌ సెహ్రావత్‌ రాకతో తెలుగు టైటాన్స్‌ పాయింట్ల వేట మొదలైంది.

పది నిమిషాల అనంతరం 5-7తో టైటాన్స్‌ రెండు పాయింట్ల వెనుకంజలో నిలిచింది. కానీ ఆ తర్వాత పట్నా పైరేట్స్‌కు గట్టి పోటీ ఇచ్చింది. పైరేట్స్‌ రెయిడర్లలో అయాన్‌, దేవాంక్‌లు మెరువగా.. డిఫెండర్లు దీపక్‌, అంకిత్‌లు ఆకట్టుకున్నారు. దీంతో ప్రథమార్థం అనంతరం పట్నా పైరేట్స్‌ 13-10తో మూడు పాయింట్ల ముందంజలో నిలిచింది. రెయిడింగ్‌, డిఫెన్స్‌లో పైరేట్స్‌తో సమవుజ్జీగా నిలిచిన టైటాన్స్‌.. అదనపు పాయింట్ల రూపంలో ఆధిక్యాన్ని కోల్పోయింది.

పుంజుకున్న టైటాన్స్‌ : 

విరామం అనంతరం తెలుగు టైటాన్స్‌ గొప్పగా పుంజుకుంది. ఓ ట్యాకిల్‌, ఓ రెయిడ్‌ పాయింట్‌తో 12-13తో పాయింట్ల అంతరాన్ని కుదించింది. పవన్‌ సెహ్రావత్‌కు ఆశీష్‌ నర్వాల్‌ జతకలిశాడు. దీంతో టైటాన్స్‌ వరుస పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ద్వితీయార్థం తొలి పది నిమిషాల్లో పది పాయింట్లు సాధించిన టైటాన్స్‌ 20-18తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో పట్నా పైరేట్స్‌ కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సొంతం చేసుకుంది.

పట్నా పైరేట్స్‌ రెయిడర్లు దేవాంక్‌, అయాన్‌లు మెరవటంతో తెలుగు టైటాన్స్‌పై ఒత్తిడి పెరిగింది. 22-21తో ఆధిక్యం ఒక్క పాయింట్‌కు చేరుకుంది. ఈ సమయంలో ఆశీష్‌ నర్వాల్‌ సూపర్‌ రెయిడ్‌తో అదరగొట్టాడు. మూడు పాయింట్లు తీసుకొచ్చి 25-21తో టైటాన్స్‌ను ఆధిక్యంలో నిలిపాడు. పైరేట్స్‌కు అయాన్‌ సూపర్‌ రెయిడ్‌ ఇవ్వగా.. ఆ జట్టు 25-25తో స్కోరు సమం అయ్యింది. ఆఖరు నిమిషంలో ఒత్తిడిలోనూ అద్బుతంగా రాణించిన తెలుగు టైటాన్స్‌ చివరి రెండు కూతల్లో పాయింట్లు సాధించింది. 28-26తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది.

దబంగ్‌ ఢిల్లీ పై హర్యానా స్టీలర్స్‌ విజయం

0

*ఎదురులేని హర్యానా స్టీలర్స్‌ దబంగ్‌ ఢిల్లీపై 41-34తో ఘన విజయం.

హైదరాబాద్‌, న్యూస్ టుడే, అక్టోబర్‌ 28 : ప్రో కబడ్డీ గత సీజన్‌ ఫైనలిస్ట్‌ హర్యానా స్టీలర్స్‌ అదరగొట్టింది. ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన లీగ్‌ దశ మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీపై హర్యానా స్టీలర్స్‌ పంజా విసిరింది. 41-34తో తిరుగులేని ప్రదర్శన చేసిన హర్యానా స్టీలర్స్‌ ఏడు పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

హర్యానా స్టీలర్స్‌ ఆటగాళ్లలో ఆల్‌రౌండర్‌ మహ్మద్‌రెజా (10 పాయింట్లు) సూపర్‌టెన్‌ షోతో మెరువగా.. శివమ్‌ (8 పాయింట్లు), జైదీప్‌ (5 పాయింట్లు) రాణించారు. దబంగ్‌ ఢిల్లీ తరఫున ఆషు మాలిక్‌ (13 పాయింట్లు), వినయ్‌ వీరేందర్‌ (8 పాయింట్లు) పోరాడినా ఫలితం దక్కలేదు. నాలుగు మ్యాచుల్లో దబంగ్‌ ఢిల్లీకి ఇది రెండో పరాజయం కాగా.. మూడు మ్యాచుల్లో హర్యానా స్టీలర్స్‌కు ఇది రెండో విజయం.

స్టీలర్స్‌ దూకుడు..

దబంగ్‌ ఢిల్లీతో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌ ఆరంభం నుంచీ దూకుడు చూపించింది. రెయిడింగ్‌లో, ట్యాకిల్స్‌లో ఆధిపత్యం చూపించింది. ప్రథమార్థంలోనే దబంగ్‌ ఢిల్లీ కోర్టును ఖాళీ చేసిన హర్యానా స్టీలర్స్‌ విలువైన ఆలౌట్‌ పాయింట్లు సొంతం చేసుకుంది. ఆల్‌రౌండర్‌ మహ్మద్‌రెజా, రెయిడర్‌ శివం, డిఫెండర్‌ జైదీప్‌ అంచనాలను అందుకున్నారు. ఇదే సమయంలో దబంగ్‌ ఢిల్లీ పాయింట్ల వేటలో తేలిపోయింది. కూతకెళ్లిన రెయిడర్లు నిరాశపర్చటం, ట్యాకిల్స్‌లో డిఫెండర్ల తడబాటు ప్రతికూలంగా మారాయి. తొలి 20 నిమిషాల ఆట ముగిసేసరికి హర్యానా స్టీలర్స్‌ ఏకంగా 11 పాయింట్ల ఆధిక్యం సాధించింది. 24-13తో ఏకపక్ష ప్రదర్శన చేసిన హర్యానా స్టీలర్స్‌ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది.

దబంగ్‌ ఢిల్లీ పోరాడినా..

ద్వితీయార్థంలో దబంగ్‌ ఢిల్లీ ప్రదర్శన కాస్త మెరుగైనా.. హర్యానా స్టీలర్స్‌కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఆ జట్టు పాయింట్లు సాధించలేదు. ప్రథమార్థంలో 11 పాయింట్ల లోటు భారీగా ఉండటంతో.. విరామం తర్వాత హర్యానా కంటే అధికంగా పాయింట్లు సొంతం చేసుకున్నా ప్రయోజనం లేకపోయింది. దబంగ్‌ ఢిల్లీ రెయిడర్‌ ఆషు మాలిక్‌ సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో మెరువగా.. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన వినయ్‌ కూతకెళ్లి ఖతర్నాక్‌ షో చేశాడు. ఆషు మాలిక్‌, వినయ్‌ మెరువటంతో దబంగ్‌ ఢిల్లీ ఆఖరు వరకు పట్టు విడువలేదు. హర్యానా స్టీలర్స్‌ జోరు తగ్గినా.. ఆధిక్యం మాత్రం చేజార్చుకోలేదు. కీలక సమయంలో పాయింట్లు సాధించి ఎప్పటికప్పుడు పైచేయి నిలుపుకుంది. ద్వితీయార్థంలో దబంగ్‌ ఢిల్లీ 21 పాయింట్లు సాధించగా.. హర్యానా స్టీలర్స్‌ 17 పాయింట్లు మాత్రమే సాధించింది.

‘ఒకే పోలీసు-ఒక రాష్ట్రం’ విధానానికి పిలుపునిస్తూ TGS నిరసన

0

హైదరాబాద్, న్యూస్ టుడే, అక్టోబర్ 28 : తెలంగాణ సచివాలయం వెలుపల భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. “ఒక పోలీసు-ఒక రాష్ట్రం” విధానాన్ని అమలు చేయాలని TGSP నిరసిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ సిబ్బంది మరియు పెన్షనర్స్ (TGSP) సంఘం చేపట్టిన ప్రణాళికాబద్ధమైన నిరసనకు ప్రతిస్పందనగా పోలీస్ ల మోహరింపు జరిగింది.

ఈ విధానం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసింగ్ పద్ధతులను ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. పలువురు టీజీఎస్పీ సభ్యులు, వారి మద్దతుదారులు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఆ ప్రాంతంలో పోలీసులను ఉంచి పరిస్థితిని అదుపులో ఉంచారు.

సచివాలయం చుట్టూ ట్రాఫిక్‌ను మళ్లించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణలో చట్టం అమలులో నాణ్యతను పెంపొందించడానికి, విషయాలను ఎలా నిర్వహించాలో మెరుగుపరచడానికి “ఒక పోలీసు-ఒక రాష్ట్రం” విధానం అవసరమని TGSP అభిప్రాయపడింది. సంఘం నాయకులు ప్రభుత్వ అధికారులతో సమావేశమై తమ డిమాండ్లపై చర్చించనున్నారు.

ఫామ్‌హౌస్ రైడ్‌పై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ బావ 

0

*విచారణకు హాజరయ్యేందుకు పాకాల తరపు న్యాయవాదులు పోలీసులను రెండు రోజుల గడువు కోరారు.

హైదరాబాద్, న్యూస్ టుడే, అక్టోబర్ 28 : మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేయడంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బావమరిది రాజ్ పాకాల సోమవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం పాకాల అడ్రస్ ప్రూఫ్‌లతో పాటు సోమవారం పోలీసుల ఎదుట హాజరుకావాలని, కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు.

విచారణకు హాజరుకావాలని పాకాల తరపు న్యాయవాదులు పోలీసులను రెండు రోజుల గడువు కోరారు.

విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. సోమవారం మోకిలా పోలీస్ స్టేషన్‌కు హాజరు కాకపోతే బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35 (3), (4), (5), (6) కింద అరెస్టు చేస్తామని మోకిలా ఇన్‌స్పెక్టర్ పాకాలకు నోటీసులు జారీ చేశారు. అయితే పాకాల అందుబాటులో లేకపోవడంతో ఆయన ఉంటున్న విల్లాపై పోలీసులు నోటీసులు పెట్టారు.

అక్టోబర్ 26న, జన్వాడలోని పాకాల ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసి విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు మరియు క్యాసినో గేమ్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 7.6 లీటర్ల విదేశీ మద్యం, 8.1 లీటర్ల ఐఎంఎఫ్‌ఎల్ మద్యం, 6 లీటర్ల బీరు.

దాడి సందర్భంగా హాజరైన వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఫ్యూజన్ ఎఐఎక్స్ సాఫ్ట్‌వేర్ సిఇఒ మరియు పాకాల అసోసియేట్ విజయ్ మద్దూరి కొకైన్‌కు పాజిటివ్ పరీక్షించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు.

యూపీ యోధాస్‌కు మూడో విజయం

0

*34-29తో గుజరాత్‌ జెయింట్స్‌పై యూపీ యోధాస్‌ గెలుపు

హైదరాబాద్‌, ది న్యూస్ టుడే (అక్టోబర్ 27) : ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో యూపీ యోధాస్‌ మూడో విజయం సాధించింది. ఆదివారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ యోధాస్‌ మ్యాచ్‌లో యోధాస్‌ 5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

యూపీ యోధాస్‌ ఆటగాళ్లలో స్టార్‌ రెయిడర్‌ భవానీ రాజ్‌పుత్‌ ( 9పాయింట్లు), ఆల్‌రౌండర్‌ భరత్‌ (13 పాయింట్లు), డిఫెండర్‌ మహేందర్‌ సింగ్‌ ( 3 పాయింట్లు) సమిష్టి ప్రదర్శనతో చెలరేగారు. గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున రెయిడర్లు రాకేశ్‌ (8 పాయింట్లు), హిమాన్షు సింగ్‌ (9 పాయింట్లు) సూపర్‌ షోతో మెరిసినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

యూపీ యోధాస్‌, గుజరాత్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. ఆరంభం నుంచీ ఇరు జట్లు ఆధిక్యం నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. యూపీ యోధాస్‌ రెయిడర్‌ భవానీ రాజ్‌పుత్‌, ఆల్‌రౌండర్‌ భరత్‌లు కూతలో మెరువగా.. గుజరాత్‌ జెయింట్స్‌ రెయిడర్‌ రాకేశ్‌, నీరజ్‌ కుమార్‌లు పాయింట్ల వేటలో దూకుడు చూపించారు. ట్యాకిల్స్‌లో జెయింట్స్‌ పైచేయి సాధించినా.. కూతలో యోధాస్‌ అదరగొట్టింది. ప్రథమార్థంలోనే గుజరాత్‌ జెయింట్స్‌ను ఓసారి ఆలౌట్‌ చేసింది. 20 నిమిషాల ఆట అనంతరం 19-17తో ఆధిక్యంలో నిలిచింది. ఆలౌట్ పాయింట్లు యూపీ యోధాస్‌ను ముందంజలో నిలిపాయి.

సెకండ్‌హాఫ్‌లోనూ ఉత్కంఠ కొనసాగింది. యూపీ యోధాస్‌ ముందంజలో నిలిచినా.. గుజరాత్‌ జెయింట్స్‌ మరీ ఎక్కువ పాయింట్ల వెనుకంజ వేయలేదు. చావోరేవో తేల్చుకోవాల్సిన రెయిడ్లలో హిమాన్షు సింగ్‌ వరుసగా పాయింట్లు సాధించటంతో గుజరాత్‌ జెయింట్స్‌ రేసులోనే నిలిచింది. రాకేశ్‌, హిమాన్షు సూపర్‌ రెయిడ్లతో 37వ నిమిషంలో గుజరాత్‌ జెయింట్స్‌ 26-27తో యోధాస్‌పై ఒత్తిడి పెంచింది.

కానీ ఆ తర్వాత చావోరేవో కూతకెళ్లిన హిమాన్షు నిరాశపరచటంతో యూపీ యోధాస్‌ మళ్లీ మూడు పాయింట్ల ఆదిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు నిమిషంలో భరత్‌ వరుసగా రెండు సార్లు సూపర్‌ రెయిడ్‌తో మెరువటంతో యూపీ యోధాస్‌ అదిరే విజయం అందుకుంది.

తమిళ్ తలైవాస్‌, పింక్ పాంథర్స్‌ మ్యాచ్‌ టై

0

30-30తో తమిళ్ తలైవాస్‌, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ స్కోర్లు సమం 

హైదరాబాద్‌, న్యూస్ టుడే 27 : ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌ టైగా ముగిసింది. ఆఖరు రెయిడ్‌ వరకు ఉత్కంఠ రేపిన జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌, తమిళ్ తలైవాస్‌ మ్యాచ్‌ 30-30తో టైగా ముగిసింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ లీగ్ దశ మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ సమవుజ్జీలుగా నిలిచి పాయింట్లను సమంగా పంచుకున్నాయి. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఆటగాళ్లలో అర్జున్‌ (7 పాయింట్లు), వికాశ్ (6 పాయింట్లు), రెజా (3 పాయింట్లు), అంకుశ్‌ ( 4 పాయింట్లు) రాణించారు. తమిళ్‌ తలైవాస్‌ శిబిరం నుంచి సచిన్‌ (11 పాయింట్లు), నరేందర్‌ (3 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ప్రథమార్థంలో ఐదు పాయింట్ల వెనుకంజలో నిలిచిన తలైవాస్‌.. సచిన్‌ సూపర్ టెన్‌ షోతో ద్వితీయార్థంలో గొప్పగా పుంజుకుంది. జైపూర్ చేజేతులా విజయాన్ని దూరం చేసుకోగా.. తలైవాస్‌ ఓటమి నుంచి తప్పించుకుంది.

జైపూర్‌ సమిష్టిగా..

గత మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌ చేతిలో ఓడిన జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌.. తమిళ్‌ తలైవాస్‌తో మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించింది. ఆరంభం నుంచి రెయిడింగ్‌లో, డిఫెన్స్‌లో పాయింట్లు సాధిస్తూ ఆధిక్యం నిలుపుకుంది. తొలి 20 నిమిషాల ఆట అనంతరం జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 21-16తో ముందంజ వేసింది. ఐదు పాయింట్లతో తలైవాస్‌పై పైచేయి సాధించింది. తలైవాస్‌ రెయిడర్లు సచిన్‌, నరేందర్‌లు మూడేసి బోనస్‌ పాయింట్లు సాధించగా జైపూర్‌కు పోటీ ఇవ్వగలిగింది. జైపూర్‌లో అర్జున్‌ దేశ్వాల్‌కు వికాశ్‌, రెజా, అంకుశ్‌లు సహకరించారు. దీంతో పింక్‌ పాంథర్స్‌ ప్రథమార్థంలో విలువైన ఆధిక్యం సొంతం చేసుకుంది.

పుంజుకున్న తలైవాస్‌..

విరామ సమయం అనంతరం జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ నెమ్మదించగా.. తమిళ్ తలైవాస్‌ వరుసగా పాయింట్లు ఖాతాలో వేసుకుంది. కానీ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఆధిక్యాన్ని నిలుపుకుంది. సచిన్‌ సూపర్‌ రెయిడ్‌కు తోడు విశాల్‌ సక్సెస్‌ఫుల్‌ రెయిడ్‌తో మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 26-29తో పాయింట్ల అంతరాన్ని కుదించిన తమిళ్‌ తలైవాస్‌ ఆఖరు వరకు రేసులోనే నిలిచింది. ఆఖర్లో కూతలో, పట్టులో అదరగొట్టిన తలైవాస్ స్కోరు సమం చేసింది. సక్సెస్‌ఫుల్‌ రెయిడ్‌తో అంతరాన్ని ఓ పాయంట్‌కు కుదించి.. ఆఖరు కూతకు వచ్చిన జైపూర్‌ రెయిడర్ రెజాను అవుట్‌ చేసింది. దీంతో 30-30తో స్కోరు సమమైంది.