మద్యం మత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కారుతో బీభత్సం..
నాలుగు చోట్ల రోడ్డు ఆక్సిడెంట్..
ఒక కారు, మూడు బైకులు, ఆటో, పాదచారుడి ని ఢీ..
చికిత్స పొందుతూ పాద చారుడు మృతి..
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో 500 పాయింట్స్..
హైదరాబాద్, ఏప్రిల్ 15 : ఐటీ కారిడార్ లో ఆదివారం అర్ధరాత్రి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తప్పతాగి కారుతో బీభత్సం సృష్టించాడు. ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి నాలుగు చోట్ల ఒక కారు, మూడు బైకులు, ఒక ఆటో, రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న పాదచారి ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ గుర్తుతెలియని పాదచారి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజాంపేట్ కి చెందిన క్రాంతి (30) ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో తన పోలో కారు(TS07EE6048)తో ఐటీ కారిడార్ లో బీభత్సం సృష్టించాడు. ఐకియా ఫ్లైఓవర్, శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ మీదగా బయో డైవర్సిటీ వైపు దూసుకువెళ్తూ ఒక కారు, మూడు బైకులు, ఒక ఆటో ని ఢీకొట్టాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదురుగా ఉన్న పిస్తా హౌస్ వద్ద రోడ్డు దాటుతున్న ఓ పాదచారున్ని ఢీకొట్టాడు. అనంతరం రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఉన్న షేక్పెట్ ఫ్లైఓవర్ పై కారులో ఉన్న క్రాంతి ని స్థానికులు వెంబడించి పట్టుకొని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. ఈ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. చికిత్స పొందుతూ పాదచారి మృతి చెందాడు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు క్రాంతి కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 500 పాయింట్లు వచ్చాయి. ఈ ప్రమాదంలో కారు, ఆటో, మూడు బైకులు ధ్వంసమయ్యాయి.