హైదరాబాద్, ఏప్రిల్ 26: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో గన్‌పార్క్ వద్దకు వచ్చానని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజలకు సీఎం ఇచ్చిన హామీలు నిజమైతే ఆయన కూడా ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోపు రాష్ట్రంలో హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తానని లేదంటే, రేవంత్‌రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని అన్నారు. మెదక్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న ఆయన హామీల అమలుపై సీఎం అమరవీరులస్తూపం వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ హరీశ్‌రావు రాజీనామా పత్రంతో అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు.
మేధావుల చేతుల్లో ఇద్దరి రాజీనామా పత్రాలు : సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో వచ్చానని హరీశ్‌రావు తెలిపారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసగించే యత్నం జరుగుతుందని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండు పేపర్లపై రాసిచ్చారని గుర్తు చేశారు. ప్రజలకు రేవంత్ ఇచ్చిన హామీలు నిజమైతే గన్‌పార్క్ వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రావడానికి ఇబ్బందిగా ఉంటే వారి పీఏ, సిబ్బందితో రాజీనామా లేఖను ఇక్కడికి పంపించినా ఫర్వాలేదని అన్నారు. మేధావుల చేతుల్లో ఇద్దరి రాజీనామా పత్రాలు పెడదామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఆగస్టు 15లోగా రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలని, ఒకవేళ హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తానని హరీశ్‌రావు చెప్పారు. చేయకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ గవర్నర్ ఇవ్వాలని తెలిపారు. అలాగే తాను ఉపఎన్నికలో కూడా పోటీ చేయనని స్పష్టంగా చెప్పానని హరీశ్‌రావు అన్నారు.