Friday, December 13, 2024
HomeSportsPRO KABADDIజైపూర్‌‌పై పట్నా పైరేట్స్‌ విజయం

జైపూర్‌‌పై పట్నా పైరేట్స్‌ విజయం

జైపూర్‌‌పై పట్నా పైరేట్స్‌ విజయం.

అర్జున్‌ దేశ్వాల్‌ 20 పాయింట్ల పోరాటం వృథా

హైదరాబాద్‌, ది న్యూస్ టుడే, నవంబర్08 : ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)  11వ సీజన్‌ లో పట్నా పైరేట్స్ జట్టు నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. హోరాహోరీగా సాగిన లీగ్ పోరులో ఆఖరి నిమిషాల్లో అద్భుతంగా ఆడి జైపూర్ పింక్ పాంథర్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో పట్నా 43–41 తేడాతో  పింక్ పాంథర్స్‌ ను ఓడించింది. పట్నా తరఫున అయాన్ 14 పాయింట్లతో సత్తా చాటగా… మరో రెయిడర్ దేవాంక్ కూడా 11 పాయింట్లతో సూపర్ టెన్ సాధించాడు. జైపూర్‌‌ జట్టులో కెప్టెన్‌, స్టార్ రెయిడర్‌‌ అర్జున్ దేశాల్‌ 20 పాయింట్లతో విజృంభించినా జట్టును గెలిపించలేకపోయాడు.

హోరాహోరీ పోరు..

పోటాపోటీగా సాగిన తొలి అర్ధభాగంలో తొలుత జైపూర్‌‌ పైచేయి సాధించినా.. చివరకు పట్నా ఆధిక్యంలోకి వచ్చింది. రెయిడ్ మిషన్ అర్జున్ దేశ్వాల్  ఆరంభం నుంచి వరుస పాయింట్లతో హోరెత్తించాడు. బోనస్‌తో తమ జట్టు ఖాతా తెరిచిన అతను వరుస టచ్ పాయింట్లతో చెలరేగాడు. అటువైపు పట్నా ఆటగాళ్లు దేవాంక్‌, అయాన్‌ కూడా విజయవంతమైన రెయిడ్స్‌తో ఆకట్టుకున్నారు. దాంతో తొలి ఐదు నిమిషాలు ఆట హోరీహోరీగా సాగింది.  కానీ, డిఫెండర్లు ఆశించిన మేర రాణించలేకపోవడంతో పట్నా వెనుకబడింది. దీన్ని జైపూర్  సద్వినియోగం చేసుకుంది. కోర్టులో మిగిలిన అయాన్‌ను ఔట్ చేసి ‌ పదో నిమిషంలోనే  పట్నాను ఆలౌట్‌ చేసి 14–10తో ముందంజ వేసింది.

ఆపై అర్జున్  సూపర్ రైడ్‌తో పాటు సూపర్‌‌10 పూర్తి చేసుకున్నాడు. దాంతో జైపూర్ ఆధిక్యం 19–13కి పెరిగింది. ఈ దశలో పట్నా అనూహ్యంగా పుంజుకుంది.  దేవాంక్‌, అయాన్ రెయిండింగ్‌లో జోరు కొనసాగించడగా… డిఫెన్స్‌లోనూ మెరుగైంది. అర్జున్‌ను ట్యాకిల్ చేసి కోర్టు బయటకి పంపించింది.దాంతో 19–19తో స్కోరు సమం చేసింది. ఆవెంటనే కోర్టులో మిగిలిన అభిజీత్‌ను ట్యాకిల్ చేసి జైపూర్‌‌ను ఆలౌట్‌ చేసిన పట్నా 22–20తో ఆధిక్యంలోకి వచ్చింది. అర్జున్‌ను మరోసారి ట్యాకిల్ చేసిన ఆ జట్టు 25–21తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.

ఆఖర్లో పట్నా మ్యాజిక్‌..

రెండో అర్ధభాగం మొదలైన వెంటనే జైపూర్ మళ్లీ జోరు పెంచింది. ముఖ్యంగా అర్జున్‌ దేశ్వాల్ చెలరేగిపోయాడు. ఒకే రెయిడ్‌లో  ఏకంగా ఐదుగురు   పట్నా ఆటగాళ్లను ఔట్ చేశాడు. తన మరో రైడ్‌లో కోర్టులో మిగిలిన అక్రమ్‌ షేక్‌ను కూడా టచ్‌ చేసి వచ్చాడు. దాంతో 24వ నిమిషంలో పట్నాను రెండోసారి ఆలౌట్‌ చేసిన పింక్ పాంథర్స్‌ 27–25తో తిరిగి ఆధిక్యంలోకి వచ్చింది. అయినా పట్నా వెనక్కు తగ్గలేదు. అయాన్‌ రెయిడింగ్‌లో హవా చూపెట్టగా.. డిఫెండర్లు కూడా పట్టుదలగా ఆడారు.

అర్జున్‌ను మరోసారి ట్యాకిల్ చేశాడు. నీరజ్‌ను సూపర్ ట్యాకిల్ చేసి మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 40–40తో స్కోరు సమం చేసింది. ఈ దశలో రెయిడ్ కు వెళ్లిన అర్జున్ ప్రత్యర్థికి దొరికిపోయాడు. కానీ,  పట్నా డిఫెండర్ లైన్ దాటడంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ లభించింది. ఆపై, డూ ఆర్ డై రెయిడ్‌లో దేవాంక్ బోనస్ సాధించడంతో పట్నా 42–41తో ఒక పాయింట్ అధిక్యంలోకి వచ్చింది. మ్యాచ్‌ చివరి రెయిడ్‌ కు వచ్చిన సోంబీర్‌‌ ను ట్యాకిల్ చేసిన పట్నా మూడు రెండు తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments