Saturday, September 14, 2024
HomeHyderabadఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవ వేడుకలు

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, శేరిలింగంపల్లి, మే 15 : అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల పద్మా రెసిడెన్సీ అపార్ట్ మెంట్స్ (ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర) నందు ఫ్లోరెన్స్ నైటింగేల్  జయంతి వేడుకలను దేవానంద్ యాదవ్ సౌజన్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ చిత్రానికి పుష్పాంజలి ఘటించి, క్రొవ్వొత్తులను వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మధుసూదన్ (సివిల్ సర్జన్, ఆర్థో, జిల్లా వైద్యశాల, రంగారెడ్డి జిల్లా) విచ్చేసి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ (NIMS, TIMS, SD EYE Hospital, CGHS, Urdu University Health Centre, HCU Health Centre, District Hospital Kondapur, Lingampally Primary Health Centre, Urban Health Centre Hafeezpet, BHEL General Hospital, ESI RC Puram, Area Hospital Patanchetu)వైద్యశాలలలో పనిచేస్తూ ఉత్తమ సేవలందించిన సేవామూర్తులైన 80 మంది నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం తో (జ్ఞాపిక, శాలువా, పుష్పగుచ్ఛం) ఘనంగా సత్కరించి తదనంతరం మాట్లాడుతూ.. రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యం అని అన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820 మే 12న ఇటలీలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుండి సేవాతత్వాన్ని అలవరచుకున్న వ్యక్తి నైటింగేల్ అని అన్నారు. మానవసేవే మాధవసేవగా భావించి మానవులకు సేవ చేయడానికి నర్సు వృత్తి సరైనదని భావించి ఈ వృత్తిని ఎంచుకొని ఆనాటి సమాజ కట్టుబాట్లను ఎదిరించి ఎన్నో కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొన్నటువంటి ధీశాలి.

ఆ రోజులలో ఆసుపత్రులు శుచీ శుభ్రత లేకుండా చాలా అధ్వాన్నంగా ఉండేవి. ఆవిడ జర్మనీ, ఐర్లాండ్ దేశాలలో తాను పనిచేసిన హాస్పిటళ్ళలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశారు. 1854 – 56 ప్రాంతంలో క్రీమియాలో ఘోర యుద్ధం జరిగినప్పుడు క్షతగాత్రులైన సైనికులకు నిరుపమానమైన సేవలు అందించి వారికి ధైర్యం చెప్పేది. సహచర నర్సులను తీసుకుని రాత్రి సమయంలో దీపం తీసుకుని క్షతగాత్రులైన సైనికుల వద్దకు వెళ్ళి వారికి వైద్య సహయాలను అందించి ఆ సైనికుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచింది. ఈ కారణంగా ఆవిడను ‘లేడీ విత్ ల్యాంప్’ అంటూ గౌరవించేవారు. ఆ సైనికులలో ఆత్మస్థైర్యాన్ని నింపి మరణాల సంఖ్య తగ్గించారు. ఆమె అనేక గ్రంథాలయాలను ఏర్పాటు చేసి అక్షరాస్యతకై విశేష కృషి చేశారు. ఆవిడ 1860 జూన్ 24న  క్రిస్టియన్స్కూల్ ఫర్ నర్సెస్’ లండన్ లో స్థాపించడం జరిగింది. ఆమె నోట్స్ ఆన్ నర్సింగ్, నోట్స్ ఆన్ హాస్పిటల్స్ అనే గ్రంథాలను రచించారు.

నర్సులను సన్మానిస్తున్నా అసోసియేషన్ సభ్యులు

అంతర్జాతీయ స్థాయిలో నర్సింగ్ పై పేపర్ ప్రజంటేషన్స్ చేయడం జరిగింది. అప్పటినుండే నర్సులకు తప్పనిసరిగా శిక్షణ ఇవ్వడం అనే విధానం ప్రారంభించబడింది. ఆమెను మదర్ ఆఫ్ మోడ్రన్ నర్సింగ్ గా గుర్తించారు. ఆవిడ భారతదేశానికి కూడా ఇతోధిక సేవలు అందించారు. విక్టోరియా రాణి సూచనల మేరకు భారతదేశంలో జరుగుతున్న అధిక మరణాలకు కారణం సరైన శానిటరీ వ్యవస్థ లేకపోవడమే అని ఆవిడ గుర్తించి అవసరమైన శానిటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మరణాల రేటును తగ్గించ గలిగింది. ఆవిడ మన మధ్య లేకపోయినా సేవానిరతి కలిగిన ప్రతి నర్సులోను ఆవిడ కలకాలం జీవించి ఉంటుంది. నర్సులు, రోగులు గుర్తుంచుకోవలసిన ఆదర్శమూర్తి ‘ఫ్లోరెన్స్ నైటింగేల్ ‘ అని అన్నారు. నర్సింగ్ వృత్తి ఆవిర్భావానికి, గౌరవానికి ప్రతీక మరియు ఆవిడ అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఆవిడ గౌరవార్థం ఆవిడ జన్మదినమైన మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవముగా ఒక ప్రత్యేక నినాదంతో నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరం ‘మన నర్సులు – మన భవిష్యత్తు, నర్సులే మన ఆర్థిక,సామాజిక శక్తి సంరక్షకులు’ అనే నినాదంతో నిర్వహించుకుంటున్నాము అని తెలిపారు. ఈనాడు సమాజంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నర్సుల కొరత ఉంది. నేటి యువతీ యువకులు నర్సింగ్ కోర్సులలో ఉన్నత విద్యను అభ్యసించిన యెడల దేశ విదేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నందున దానిపై దృష్టి సారించాలి అని కోరారు.

ఈ సందర్భంగా నర్సులందరి చేత ఆవిడ జీవితాన్ని సేవానిరతిని ఆదర్శంగా తీసుకొని మనసా, వాచా, కర్మణా రోగులకు సేవలందిస్తామ ని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దేవానంద్ యావద్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విజయలక్ష్మి, వాణీ సాంబశివరావు, జనార్ధన్, పాలం శ్రీను, ధర్మసాగర్, వెంకటేశ్వర్లు, బాలన్న, జిల్ మల్లేష్, M. S. రావు, శ్రీమతి సంతోషి, లక్ష్మీ మరియు నర్సులు పాల్గొన్నారు.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments