Monday, September 16, 2024
HomeCulturalఘనంగా గురు పూజా మహోత్సవము

ఘనంగా గురు పూజా మహోత్సవము

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 04 : జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శేరిలింగంపల్లి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మరియు సరస్వతీమాత చిత్రపటాలకు జ్యోతి ప్రదీపనము చేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య Y. రెడ్డి శ్యామల, పీఠాధిపతి, భాషాభివృద్ధి పీఠము, తెలుగు విశ్వవిద్యాలయం విచ్చేసి శేరిలింగంపల్లి మండల పరిధిలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, జవహర్ నవోదయ, గురుకుల బాలుర మరియు బాలికల కళాశాలలు, రాయదుర్గ్, కొత్తగూడ, శేరిలింగంపల్లి, మియాపూర్ జిల్లా పరిషత్తు హైస్కూల్స్ కాంప్లెక్స్ ల  పరిధిలో గల ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులలో 35 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను సాంప్రదాయ పద్ధతిలో (సన్నాయి మేళాల నడుమ వేద పండితుల ఆశీర్వచనము, శాలువా, జ్ఞాపిక, పగడి, పుష్పగుచ్ఛము మరియు తాంబూలంతో) ఘనంగా సత్కరించటం జరిగింది.

ఈ కార్యక్రమం తూనిక రాఘవేంద్రరావు (సామాజికవేత్త మరియు బిల్డర్) సౌజన్యంతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్యామల మాట్లాడుతూ ఈ సమాజంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా గౌరవింపబడే వృత్తి అధ్యాపక వృత్తి అని అన్నారు. వేద కాలం నుండి మాతా పితరుల తరువాత గురువుకు పెద్ద పీఠం వేసింది ఈ సమాజం. విద్యార్థులను అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించే వాడే గురువు. గురువు తను ఆర్జించిన విజ్ఞానాన్ని అంతా కూడా శిష్యులకు ధారపోసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వాడు గురువు. సృష్టి, స్థితి, లయల నిర్దేశకుడే గురువు. అందుకనే గురు పూజా మహోత్సవము జరుపుకుంటున్నాము. మనదేశంలో సెప్టెంబర్ 5వ తేదీన ఈ గురుపూజా మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ  అసాధారణ ప్రజ్ఞాశాలి, రాజనీతి కోవిదుడు, విద్యావేత్త, ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పడంలోనూ, విద్యకు సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన చొరవ అయనను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. ఆయన విశ్వవిఖ్యాత తాత్వికవేత్త. ఆయన అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా, ఉప కులపతిగా, యునెస్కో అధ్యక్షుడిగా, విదేశీ రాయబారిగా, స్వతంత్ర భారత ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సమాజానికి, దేశానికి విశేషమైన సేవలు అందించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో పాఠాలను బోధించారు. ఆయనను కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్ లాంటి అనేక విదేశీ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతోటి సత్కరించడం జరిగింది. ఆయన భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టారు. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన తరగతి గదులలో దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పారు.

జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని సెలవిచ్చారు. ఉపాధ్యాయులే భవిష్యత్ సమాజ నిర్దేశకులు అని పేర్కొన్నారు. ఆయన ఉపాధ్యాయ వృత్తికి గుర్తింపు మరియు గౌరవాన్ని  కలిగించారు. ఆయన గొప్ప తాత్విక రచయిత. తత్వశాస్త్రంపై అనేక రచనలు చేశారు. ఆయన మన అందరికి ఆదర్శప్రాయుడు. ఆయన గౌరవార్ధం ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5వ తారీఖును ఉపాధ్యాయ దినోత్సవంగా 1962 నుండి నిర్వహించుకుంటున్నాము అని తెలిపారు.

నేటి యువ ఉపాధ్యాయులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని క్షేత్ర స్థాయిలో వస్తున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ నూతన విద్యా విధానంలో వస్తున్న మార్పులను ఆకళింప చేసుకొని భావిభారత పౌరులైన విద్యార్థిని విద్యార్థులకు విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందించి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయవలసిన సామాజిక బాధ్యత అధియాపకులదే అని అన్నారు. అధ్యాపక వృత్తికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని అధ్యాపకుల జీవనశైలి మిగతావారికి ఆదర్శప్రాయంగా ఉండే విధంగా నడుచుకోవాలి అని కోరారు. విద్యార్థులు గురువులు చెప్పిన విధంగా నడుచుకొని, ఎల్లవేళలా గురువులను గౌరవించాలి. వారి తల్లిదండ్రులు కూడా గురువులను గౌరవిస్తూ సహకరించాలి అని కోరారు.

ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రత్న ప్రభగారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో T.రాఘవేంద్రరావు వివిధ పాఠశాలల, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు V. ఫణికుమార్, అమ్మయ్య చౌదరి, వాణి సాంబశివరావు, జనార్ధన్, పాలం శ్రీను, నేమానివిశ్వశాంతి, G.వెంకటధర్మసాగర్ , విజయలక్ష్మి, త్రివేణి, మమతా , సత్యవాణి, వరలక్ష్మి, G.V.రావు, బాలన్న, M.S.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments