*ఆశీష్ మెరిసే.. టైటాన్స్ మురిసే..పట్నా పైరేట్స్ పై తెలుగు టైటాన్స్ విజయం.
హైదరాబాద్, న్యూస్ టుడే, అక్టోబర్ 28 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి నుంచి పుంజుకున్న తెలుగు టైటాన్స్.. సోమవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై మెరుపు విజయం సాధించింది.
ప్రథమార్థంలో వెనుకంజ వేసిన టైటాన్స్.. ద్వితీయార్థంలో దుమ్మురేపే ప్రదర్శన చేసింది. 2 పాయింట్ల తేడాతో సీజన్లలో రెండో విజయం సాధించి.. వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. తెలుగు టైటాన్స్ రెయిడర్లు ఆశీష్ నర్వాల్ (9 పాయింట్లు), పవన్ సెహ్రావత్(5 పాయింట్లు), డిఫెండర్ అంకిత్ (4 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్ తరఫున రెయిడర్లు దేవాంక్(7 పాయింట్లు), అయాన్ (6 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్‌కు మూడు మ్యాచుల్లో ఇది రెండో ఓటమి కాగా.. తెలుగు టైటాన్స్‌కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో విజయం కావటం విశేషం.
ప్రథమార్థం హోరాహోరీ :
వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్.. పట్నా పైరేట్స్‌తో మ్యాచ్‌లో సైతం శుభారంభం చేయలేదు. స్టార్ రెయిడర్ పవన్ సెహ్రావత్ తొలి కూతలోనే అవుట్ కాగా.. ఐదు నిమిషాల వరకు అతడు బెంచ్‌పైనే కూర్చుకున్నాడు. ఆరో నిమిషంలో పవన్ సెహ్రావత్ రాకతో తెలుగు టైటాన్స్ పాయింట్ల వేట మొదలైంది.
పది నిమిషాల అనంతరం 5-7తో టైటాన్స్ రెండు పాయింట్ల వెనుకంజలో నిలిచింది. కానీ ఆ తర్వాత పట్నా పైరేట్స్‌కు గట్టి పోటీ ఇచ్చింది. పైరేట్స్ రెయిడర్లలో అయాన్, దేవాంక్‌లు మెరువగా.. డిఫెండర్లు దీపక్, అంకిత్‌లు ఆకట్టుకున్నారు. దీంతో ప్రథమార్థం అనంతరం పట్నా పైరేట్స్ 13-10తో మూడు పాయింట్ల ముందంజలో నిలిచింది. రెయిడింగ్, డిఫెన్స్‌లో పైరేట్స్‌తో సమవుజ్జీగా నిలిచిన టైటాన్స్.. అదనపు పాయింట్ల రూపంలో ఆధిక్యాన్ని కోల్పోయింది.
పుంజుకున్న టైటాన్స్ :
విరామం అనంతరం తెలుగు టైటాన్స్ గొప్పగా పుంజుకుంది. ఓ ట్యాకిల్, ఓ రెయిడ్ పాయింట్‌తో 12-13తో పాయింట్ల అంతరాన్ని కుదించింది. పవన్ సెహ్రావత్‌కు ఆశీష్ నర్వాల్ జతకలిశాడు. దీంతో టైటాన్స్ వరుస పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ద్వితీయార్థం తొలి పది నిమిషాల్లో పది పాయింట్లు సాధించిన టైటాన్స్ 20-18తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో పట్నా పైరేట్స్ కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సొంతం చేసుకుంది.
పట్నా పైరేట్స్ రెయిడర్లు దేవాంక్, అయాన్‌లు మెరవటంతో తెలుగు టైటాన్స్‌పై ఒత్తిడి పెరిగింది. 22-21తో ఆధిక్యం ఒక్క పాయింట్‌కు చేరుకుంది. ఈ సమయంలో ఆశీష్ నర్వాల్ సూపర్ రెయిడ్‌తో అదరగొట్టాడు. మూడు పాయింట్లు తీసుకొచ్చి 25-21తో టైటాన్స్‌ను ఆధిక్యంలో నిలిపాడు. పైరేట్స్‌కు అయాన్ సూపర్ రెయిడ్ ఇవ్వగా.. ఆ జట్టు 25-25తో స్కోరు సమం అయ్యింది. ఆఖరు నిమిషంలో ఒత్తిడిలోనూ అద్బుతంగా రాణించిన తెలుగు టైటాన్స్ చివరి రెండు కూతల్లో పాయింట్లు సాధించింది. 28-26తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది.